క్రైస్తవులు సినిమాలు చూడవచ్చా?

క్రైస్తవులు సినిమాలు చూడవచ్చా?

క్రైస్తవులు సినిమాలు, సీరియల్స్ చూడకూడదు అని ఎవరితోనైనా చెప్తే వెంటనే వారు సినిమాలు చూడకూడదని బైబిల్లో ఉందా అని అడుగుతుంటారు. నిజమే బైబిల్ రాయబడే సరికి సినిమాలు, సీరియల్స్ కనుగొనబడలేదు. సాతాను మనుష్యులను పాపులుగా చెయ్యడానికి అనేక కొత్తపద్ధతులను కనుగొంటూ ఉంటాడు. వాటికి అనేక పేర్లు పెట్టబడుతుంటాయి. వాటి పేర్లన్నీ బైబిల్లో ఉండవు కానీ ఖచ్చితంగా వాటిని ఖండించే వచనాలు బైబిల్లో ఉంటాయి.

మన దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు సాతాను కుతంత్రాలను తుత్తునీయులు చేయు వాక్యఖడ్గాన్నిమన చేతిలో ఉంచాడు. సినిమాలు, సీరియల్స్ ఎందుకు కనుగొనబడ్డాయో, వాటిని ఎవరు కనుగొన్నారో తెలుసుకుంటే వాటిని మనం చూడవచ్చా? చూడకూడదా? అనేది సులువుగా అర్ధమవుతుంది.

సినిమాలు పాపమా ?

ఎ) సినిమా అనేది నటనతో నిండి ఉంటుంది.

నటన అనగా వేషధారణ. నటులను మొదట్లో వేషగాళ్లు అనేవారు. దేవునికి నటన అనగా వేషధారణ అంటే ఇష్టం ఉండదు. దేవునికిష్టం లేనిది పాపము కాదా? వేషధారణ, నటనతో నిండి ఉన్న సినిమా పాపము కాదా? ఈ లోకపు నటన గతించుచున్నది (1 కొరింథీ 7:31)

బి) సినిమాలో శృంగార సన్నివేశాలుంటాయి.

శృంగారం అనేది భార్యాభర్తల మధ్య రహస్య ప్రక్రియగా ఉండాలనేది దేవుని చిత్తం. కానీ సినిమా ఆ రహస్య ప్రక్రియలను బహిరంగముగా అనేకమందికి చూపి

వ్యభిచారపు ఆలోచనలను మనుష్యులలో రేకెత్తిస్తుంది. ఎంతోమంది చిన్న బిడ్డలు, యవ్వనస్థులు, పెండ్లి అయినవారు, కొంతమంది వృద్ధులు కూడా సినిమాలలోని శృంగార సన్నివేశాలను చూసి కామతప్తులుగా, జారత్వకులుగా, వ్యభిచారులుగా నాశనమయిపోతున్నారు. ఈ రహస్య ప్రక్రియను బహిరంగముగా చూపడం, అనేకమంది వ్యభిచారులుగా తయారవ్వడం దేవునికిష్టం లేనిది. దేవునికిష్టం లేనది పాపము కాదా? శృంగార సన్నివేశాలను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చూపించే సినిమా పాపము కాదా?

 

సి) సినిమాలో యవ్వనస్తుల ప్రేమ సన్నివేశాలుంటాయి.

యవ్వనస్తుల మధ్య ఉండే ప్రేమ తప్పు కాదని, ఆ ప్రేమ దైవమని, వారు ప్రేమించి పెళ్ళి చేసుకోవచ్చని సినిమా బోధిస్తుంది. కానీ ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకం. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు (విలాప 3:27) అని వాక్యం సెలవిస్తుంది. యవ్వనస్తులు దేవుని కాడి మోయాలని, దుష్టుని జయించాలని, పాపానికి దూరంగా పారిపోవాలని, పెండ్లికి ముందు పాపము చేయకూడదని దేవుని కోరికయై యున్నది. కానీ సినిమాలు చూస్తున్న యవ్వన బిడ్డలు ప్రేమ తప్పుకాదని, ప్రేమే దైవమని ప్రేమలోపడి పెండ్లికి ముందు దేవుని కిష్టం లేని పాపం చేస్తూ దుష్టునికి లొంగిపోయి దేవునికి దూరంగా జీవిస్తూ శాపపు కాడిని మోస్తున్నారు. భవిష్యత్తులు పాడుచేసుకుంటున్నారు. దేవుని కాడి మోయకుండా శాపపు కాడిని మోయిస్తున్న ప్రేమ సన్నివేవాలు చూపడం దేవుని కిష్టం లేదు. దేవుని కిష్టం లేనిది పాపం కాదా? దేవుని కోరికకు వ్యతిరేకంగా యవ్వనస్తుల మధ్య ఉండే కామపు ప్రేమను చూపించే సినిమా పాపము కాదా?

డి) సినిమాలలో స్త్రీలను అర్ధనగ్నంగా చూపించే సన్నివేశాలుంటాయి.

ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును (మత్త 5:28) అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే స్త్రీని చెడ్డగా చూస్తారో వారు వ్యభిచారం చేసినట్టేనని ఈ మాటలలోని ఆంతర్యం. సినిమా చూస్తున్న పురుషులు ఆ సినిమాలో అర్ధనగ్నంగా కనబడుతున్న స్త్రీలను చూడకుండా ఉండగలరా? సినిమా చూస్తున్న పురుషుడు ఆ స్త్రీలను చెడ్డగా చూసి వాక్య ప్రకారం ఎన్ని వ్యభిచారాలు చేస్తున్నారో లెక్కపెట్టలేము. ఆ హీరోయిన్లనే ఊహించుకుంటూ, వారి కొరకు కలలు కంటూ ఎంతోమంది దేవునికి ఆలయమైన హృదయాన్ని పాడుచేసుకుంటున్నారు. అర్ధనగ్నంగా చూపించే స్త్రీల సన్నివేశాలు వాటిని చూసి వ్యభిచార నిలయాలుగా మారిపోతున్న హృదయాలు దేవునికి బాధ కలిగించేవి. దేవునికి బాధ కలిగించేవి పాపాలు కాదా? అనేకమంది హృదయాలను సాతాను నిలయాలుగా మార్చుటకు కారణమైన అర్ధనగ్న స్త్రీల సన్నివేశాలు చూపించే సినిమా పాపము కాదా?

ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన విషయాలు

కళ్ళ ముందుకు వస్తాయి. దేవునికి ఇష్టం లేనివి ఆయనకు బాధ కలిగించేవి వాక్య వ్యతిరేకమైనవి సినిమాలలో కనబడుతూ ఉంటే దేవుని పిల్లలు ఎలా సినిమాలను చూడగలరు? సినిమాలు దేవునికి బాధ కలిగించేవిగా ఉన్నప్పుడు వాటిని చూస్తున్నవారు కూడా దేవునికి బాధ కలిగిస్తున్నారు అని అర్ధం చేసుకోవాలి. ప్రియ తమ్ముడా, ఇంతవరకూ సినిమాలు పాపమా? కాదా? అనే విషయాలను క్లుప్తంగా నీ ముందుంచాను. నువ్వు దేవుని కుమారుడవైతే ఆయనకు ఇష్టం లేనిది నీకూ ఇష్టం ఉండకూడదు. ఆయనను బాధపెట్టేదానికి నువ్వు దూరంగా ఉండాలి. నువ్వు దేవుని కుమారుడవో కాదో నిర్ణయించుకో. దేవుని కుమారుడిని అనుకుంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపుచూడు. సినిమాల వైపు కాదు.

సినిమాలు, సీరియల్స్ ఎందుకు కనుగొనబడ్డాయి?

  1. కాలక్షేపం కోసం సమయాన్ని తెలియకుండా వ్యర్ధం చెయ్యడానికి.
  2. మనుషుల యొక్క జ్ఞానాన్ని (ఆది 11:4) ని చూపించుకోవడానికి, అంటే మనుషులు తమని తాము

హెచ్చించుకోవడానికి, పేరు సంపాదించడానికి.

  1. లోకంలో ఉన్న ప్రతీ వాటిని చూపుతూ, ఇంకా లోకంలోనికి ప్రవేశించని వాటిని లోకానికి పరిచయం చెయ్యడం.
  2. లేని వాటిని అసాధ్యమైన వాటిని జరుగుతున్నట్లుగా చూపించుట.
  3. అశ్లీలతను నాగరికతగా మార్చడం.
  4. శరీర సంబంధమైన ఉల్లాసాన్ని కల్గించడం

ఇవన్నీ సినిమాలు, సీరియల్స్ యొక్క లక్ష్యాలు అందుకే అవి కనుగొనబడ్డాయి. బైబిల్ వీటిని గూర్చి ఏమంటుందో తెలుసుకుందాం.

  1. దినములు చెడ్డవి కాబట్టి సమయమును పోనియ్యక సద్వినియోగం చేసుకొనుడి. దేవుడేమో సమయమును వ్యర్ధం చెయ్యొద్దు అంటున్నాడు (ఎఫెసీ 5:15,16).

సినిమాయెమో సమయమును వ్యర్ధం చెయ్యడానికే కనుగొనబడింది.

  1. ఏవి సత్యమైనవో, ఏవి ఖ్యాతియైనవో, ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి… అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై యుండును (ఫిలిప్పీ 4:8, 9). క్రైస్తవుడు తన ఆలోచన, మనసు పైన చెప్పబడిన వాటిమీదనే నిలపాలి అప్పుడు దేవుని తోడు అతనికి ఉంటుంది. ఏ సినిమాలో అయినా సీరియల్ లో అయినా పై లక్షణాలు ఉన్నాయా? ఉంటాయా? ఉంటే మాత్రం చూడవచ్చు. కాని ఉండడం మాత్రం అసంభవము.

సినిమా, నటన అందులో సత్యం లేదు. మాన్యత, పవిత్రత, ఖ్యాతి, సత్యం.. అసలేమాత్రము ఉండవు.

మీరు లోక వార్తలు చెప్పుకొనకుడి.. సినిమా అంతా లోకమేకదా చూచుట చేత కన్ను, వినుట చేత చెవులు సంతృప్తి చెందకున్నాయి. నీ కన్ను చెడు చూస్తే నీ దేహమంతా చీకటిమయమవుతుంది(ప్రసంగి 1:8, మత్తయి 6:22,23). దేనినైతే చూడాలని పదే పదే ఆశపడతామో అదే ‘నేత్రాశ’ అది దేవుని నుండి పుట్టినది కాదు నేత్రాశను జరిగించువాడు లోకంతో పాటు నశించును (1యోహాను 2:15,16).

సినిమాలు, సీరియల్స్ ఎన్ని చూసినా తృప్తిలేదు. సాతాను నుండి కలిగే వాటిలో ఆనందం ఉండొచ్చు కాని సంతృప్తి ఉండదు. దేవుని నుండి కొంచెం కలిగినా అందులో పూర్ణసంతృప్తి ఉంటుంది. సినిమాలు, సీరియల్స్ లో అసంతృప్తికి కారణం అవి సాతాను నుండి కలుగుట వలనే. చెడు చూస్తే దేహమంతా చీకటవుతుంది. వాటిని చూడాలని ఆశపడుట నేత్రాశ… ఘోర పాపం.

పైన చూపబడిన వచనాలను బట్టి సినిమాలు, సీరియల్స్ చూడటం పాపమని నిస్సందేహంగా నిర్ధారించబడింది. అయితే సినిమాల పిచ్చి ఉన్న కొందరు క్రైస్తవులు (పాస్టర్లు కూడా) సినిమాలు చూడవచ్చు, మంచిది తీసుకొని చెడును విడిచిపెట్టాలి అంటారు. మురికి నీటలో మినరల్ వాటర్ కలిపి మళ్ళీ రెంటినీ వేరు చేయగలమా? వేటగాడు వేసిన ధాన్యం మాత్రం తిని, ఉచ్చులోనికి వెళ్ళకుండా ఎగిరిపోదామనుకుంటే ఆ పక్షులదెంత అజ్ఞానం.. అసలు సినిమాలో మంచి ఉందో లేదో చూద్దాం.

దేవుని నుండి వచ్చు ప్రతీది మంచిది (ఆది 1 వ అధ్యాయం). సాతాను సృజించిన ప్రతీది చెడ్డది. అది చూడటానికి మంచిదిలా కన్పించేలా చేస్తాడు కానీ దాని వెనుక నాశనముంటుంది. ఇప్పుడు సినిమా, సీరియల్స్ ను ఎవరు సృష్టించారో పరిశీలిద్దాం. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి.

సినిమా నిజమా అబద్ధమా? అబద్ధం

సీరియల్ నిజమా అబద్ధమా? అబద్ధం

సినిమా మరియు సీరియల్స్ లో నటులు చేసేదంతా నిజమా అబద్ధమా? అబద్ధం.

నీవు సినిమాను, సీరియల్ ని చూస్తుండగా నమ్ముతున్నావా లేదా?. నమ్ముతున్నావ్ (నమ్ముతున్నావ్ కాబట్టే ఆ సన్నివేశాలకు నీవు స్పందిస్తున్నావ్. ప్రేరేపించబడుతున్నావ్. నవ్వుతున్నావ్. ఏడుస్తున్నావ్.) అసలు అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను. యోహా 8:44

సినిమాలు, సీరియల్స్ అబద్ధమైతే వాటి జనకుడెవడు? సాతానుడే.

సాతాను కల్పించిన అబద్ధాన్ని నీవు నమ్ముతున్నావ్. దానిని నీవు ప్రేమిస్తున్నావ్. నీ ఇంట్లో, కంప్యూటర్ లో, సెల్ ఫోన్ లో దాన్ని జరిగిస్తున్నావ్. అబద్ధాన్ని ప్రేమించి, జరిగించు ప్రతీవాడు నరకానికి పోక తప్పదు (ప్రక 21:8,22:15). సాతాను సృష్టించిన సినిమాలో, సీరియల్స్ లో మంచి ఉందని, దాన్ని గ్రహించుకోవాలని అనుకోవడం అజ్ఞానం. మంచి నేర్చుకోవాలంటే బైబిల్ నుండే సాధ్యం. సినిమాల్లో మంచి ఉన్నట్లు కన్పిస్తుంది. దాన్నే మోసం అంటారు. ఈ పండు తింటే నీవు దేవదూతవలె అవుతావన్నాడు సాతాను. అది హవ్వకి మంచి బోధిస్తున్నట్లుగా కన్పించింది. కానీ ఆ అబద్ధాన్ని నమ్మి జరిగించినందుకు మోసపోయింది, నష్టం తెచ్చింది. సినిమా కూడా అంతే మంచి వున్నట్లుగా చూపుతూ చెడు నేర్పి నాశనం చేస్తుంది. క్రైస్తవుడు సినిమాలు సీరియల్స్ చూడటం పూర్తిగా వాక్యవిరుద్ధం, పాపం. సినిమా నేత్రాల ద్వారా హృదయంలో ప్రవేశించి తలంపులను చెరుపుతుంది. దేవునికి దూరం చేస్తూ సాతానుకి దగ్గర చేస్తుంది. కాబట్టి సినిమాలు చూడకూడదు.

Leave your vote

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *